ఉష్ణ్రోగ్రతలు పెరిగితే గుండెకు ముప్పు!

అధిక ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు డల్లాస్‌ పరిశోధకులు గుర్తించారు. గడిచిన 76 ఏండ్లలోనే ఎన్నడూ లేనంత అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత ఇటీవల కువైట్‌లో 129 ఫారన్‌హీట్‌గా నమోదైందని, ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటం మంచిది కాదని హెచ్చరించారు. సాధారణ ఉష్ణోగ్రత ఎక్కువవుతుంటే గుండ సంబంధిత కారణాలతో మరణించే వారి సంఖ్య రెండు రెట్లు లేదా మూడు రెట్లు కావొచ్చని చెప్పారు. కువైట్‌లో అధిక ఉష్ణోగ్రతల వల్ల 2010-2016 వరకు 15,000 మందికి పైగా గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణించారని వెల్లడించారు.


అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాటిల్లుతున్న ఈ ముప్పు పురుషుల్లో 3.5 రెట్లు ఎక్కువగా, మహిళల్లో 2.5 రెట్లు ఎక్కువగా, 15 నుంచి 64 ఏండ్లు గల శ్రామిక వర్గంలో 2 రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించారు. వైద్య నిపుణులు సాధారణంగా గుండె వ్యాధి అని చెప్పగానే.. బీపీ, ఆహారం, మానసికి ఒత్తిడి తదితర కారణాలపైనే శ్రద్ధ చూపిస్తారని, అయితే వాతావరణ మార్పులను కూడా పట్టించుకోవాలని సూచించారు. ప్రపంచం ప్రమాదపుటంచులో ఉందని, చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గించే చర్యలకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు.